ఎల్లారెడ్డి రూరల్: తెల్లారితే దీపావళి.. అసలే కూతురు, అల్లుడు వచ్చాడు.. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండొద్దు.. ఇల్లంతా లైట్లతో వెలిగిపోవాలి.. పటాకుల శబ్దంతో మార్మోగిపోవాలి.. మొత్తంగా పండుగను ధూంధాంగా జరుపువాలని అనుకుంది ఆ కుటుంబం. కానీ వారు అనుకున్నది ఒక్కటి.. అయింది ఒక్కటి ! దీపాల పండుగకు ధగధగ మెరిసిపోవాలని అనుకున్న ఆ ఇంట్లో చీకట్లు అలుముకున్నాయి. పండుగకు పటాకులు కొందామని వెళ్లి ఆ ఇంట్లో నలుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా ఎర్రపహాడ్ మండల కేంద్రం శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డికి చెందిన శ్రీనివాస్ ( 52) పండుగకు కూతురు, అల్లుడు ఇంటికి రావడంతో దీపావళిని ధూంధాంగా జరుపుకోవాలని అనుకున్నాడు. దీంతో పటాకులు, దీపాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు బుధవారం కారులో కామారెడ్డి వెళ్లాడు. తనతో పాటు అల్లుడు ఆనంద్ కుమార్ (31), సోదరుడు జగన్ (45 )తో పాటు మరో ఐదుగురు కుటుంబసభ్యులను తీసుకెళ్లాడు. షాపింగ్ పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే భారీ వర్షం కురుస్తుండటంతో ఎర్రపహాడ్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, అతని అల్లుడు ఆనంద్, సోదరుడు జగన్తో పాటు ఐదేళ్ల మనుమడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు . క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పండుగ పూట ఒకేసారి నలుగుర్ని కోల్పోవడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి.