పెద్దపల్లి : మద్యానికి బానిసైన కొడుకు రోజు కుటుంబాన్ని వేధిస్తుండటంతో ఆ తండ్రి సహనం కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును సొంత తండ్రే హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కలగూడూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేడం శంకరయ్య తన కుమారుడు మేడం రాజ్ కుమార్ను కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రాజ్ కుమార్ ప్రతిరోజు మద్యం సేవించి తండ్రితో పాటు కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. మద్యం మత్తులో మరోసారి రెచ్చిపోయిన రాజ్ కుమార్ను తండ్రి శంకరయ్య కర్రతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, బసంత్ నగర్ ఎస్సై మహేందర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.