Suryapet | సూర్యాపేట (పాకలవీడు) : కుటుంబ కలహాలతో కూతురుతో కలిసి తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో పరిస్థితి విషమించడంతో తండ్రి మృతి చెందగా.. కూతురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెంలో గురువారం చోటు చేసుకున్నది. ఎస్ఐ సైదులుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన షేక్ లతీఫ్(40), లతీఫ్బీ దంపతులకు కుమారుడు నాగుల్‌మీరా, కుమార్తె హసీనా(18) ఉన్నారు.
జనవరి 3న కుమారుడు నాగుల్‌మీరా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయి. దాంతో లతీఫ్ మరింత మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణ నిమిత్తం వీరు గ్రామం వదిలి మిర్యాలగూడకు వెళ్లగా.. అక్కడ సైతం తరచూ గొడవలు జరుగడంతో కుమార్తె హసీనాతో కలిసి లతీఫ్ వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. ఈ నెల 5న తిరిగి మిర్యాలగూడకు వెళ్లగా భార్యతో మళ్లీ గొడవ కావడంతో లతీఫ్ కుమార్తెతో కలిసి గ్రామానికి వచ్చాడు.
కుటుంబంలో తరచూ జరుగుతున్న గొడవలకు మనస్తాపం చెంది ఇద్దరూ చనిపోవడానికి నిర్ణయించుకున్నారు. కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని లతీఫ్ కుమార్తె హసీనాతో కలిసి తాగాడు. ఆత్మహత్యాయత్నం గుర్తించిన బంధువులు వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడకు తరలిస్తుండగా మార్గమధ్యంలో లతీఫ్ మృతిచెందాడు. కుమార్తె హసీనా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హసీనా చిన్నమ్మ షేక్ లాల్‌బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.