భోపాల్: ఒక వాటర్ పార్క్‌లో మహిళలను కొందరు వ్యక్తులు వేధించారు. ఆ కుటుంబ సభ్యులు దీనిపై నిలదీయగా ఆ గ్యాంగ్ వారిపై కర్రలతో దాడి చేసింది. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంపూర్ బఘేలాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుహియాలో వెకేషన్ వాటర్ పార్క్ ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, పెద్దలతో కూడిన ఒక కుటుంబం అక్కడకు వెళ్లింది. అయితే వాటర్ పార్క్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న బాలికలను కొందరు వేధించారు. దీంతో ఆ బాలికలు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలిపారు.
దీని గురించి ఆ వ్యక్తులను ఆ కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తులు తమ అనుచరులకు ఫోన్ చేశారు. కర్రలతో అక్కడకు వచ్చిన వారు ఆ కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా కొట్టారు. ఆ కుటుంబంలోని మగవారితోపాటు మహిళలు, పిల్లలు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటనపై రాంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాటర్ పార్క్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కుటుంబంపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆ కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CCTV Footage: Family beaten up for resisting molestation in water park in Madhya Pradesh's Satna pic.twitter.com/awFSKYDBPA
— India.com (@indiacom) June 13, 2022