Baahubali the Epic |భారతీయ సినిమా చరిత్రనే మార్చేసిన ఎపిక్ ‘బాహుబలి’ మరోసారి వార్తల్లో నిలిచింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క శెట్టి, తమన్నా భాటియా హీరోయిన్లుగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చిన ఈ ఫ్రాంచైజీ, ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.ఇటీవల ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రెండూ కలిపి రూపొందించిన ‘బాహుబలి ది ఎపిక్’ను థియేటర్లలో ప్రతిష్టాత్మకంగా రీ-రిలీజ్ చేయగా, అది మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించింది.
రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి, ‘బాహుబలి’ బ్రాండ్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ ఎపిక్ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బాహుబలి ది ఎపిక్’ స్ట్రీమింగ్ హక్కులపై తాజాగా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. వాస్తవానికి, ‘బాహుబలి’ ఒరిజినల్ రెండు భాగాల డిజిటల్ హక్కులు ఇప్పటికే జియో హాట్‌స్టార్ వద్ద ఉన్నాయి. అదే ఒప్పందం ప్రకారం, సింగిల్ పార్ట్‌గా రూపొందిన ‘బాహుబలి ది ఎపిక్’ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డిసెంబర్ 25 నుండి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. అయితే రీరిలీజ్ సమయంలో థియేటర్‌కి సంబంధించిన కొన్ని సన్నివేశాలని తొలగించారు. ఇప్పుడు వాటిని యాడ్ చేస్తారా అనే ఆసక్తికర చర్చ కూడా నడుస్తుంది.
‘బాహుబలి’ విజయంలో రాజమౌళి విజన్‌తో పాటు సాంకేతిక నిపుణుల కృషి అపూర్వం. ముఖ్యంగా ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. శోభు యార్లగడ్డ అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించిన ఈ సినిమా, థియేటర్లలోనే కాదు, ఓటీటీలో కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, మహిష్మతి రాజ్యం మరోసారి డిజిటల్ ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధమవుతోంది.