Canada | కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్యకు గురైంది. టొరంటోలోని ఓ నివాసంలో హిమాన్షి ఖురానా (30) హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం కెనడా వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.
టొరంటో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 19 శుక్రవారం రాత్రి 10.41 గంటలకు స్ట్రాచన్ అవెన్యూ – వెల్లింగ్టన్ స్ట్రీట్ వెస్ట్ ప్రాంతం నుంచి ఒక మిస్సింగ్ ఫిర్యాదు అందింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. కాల్ వచ్చిన ప్రాంతానికి సమీపంలోనే చివరిసారిగా కనిపించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 6.30 గంటల సమయంలో అదే ప్రాంతంలోని ఓ నివాసంలో హిమాన్షి మృతదేహం కనిపించింది. దీంతో హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టొరంటోకు చెందిన అబ్దుల్ గఫూర్ (32) హంతకుడిగా నిర్ధారించారు. మృతురాలితో అతనికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే వారి మధ్య ఉన్న సంబంధం గురించి మాత్రం బయటపెట్టలేదు.
ఈ ఘటనపై కెనాలోని భారత దౌత్య కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “ భారత యువతి హిమాన్షి ఖురానా హత్యకు గురవ్వడం చాలా బాధాకరం. ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి” అని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సంతాపం తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తున్నామని పేర్కొంది. నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పింది.