Fake judge arrest | పంజాబ్లోని అమృత్సర్లో నకిలీ న్యాయమూర్తి పట్టుబడ్డాడు. తనకు తాను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి వాహనానికి నీలిరంగు బీకాన్తోపాటు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అన్న నేమ్ బోర్డు తగిలించుకున్నాడు. పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి భద్రత కల్పించాలని ఆదేశించడంతో ఈ నకిలీ న్యాయమూర్తి బండారం కాస్తా బయటపడింది.
మజితా రోడ్డులోని శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్న మిషు ధీర్ తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఏసీపీ నార్త్ వరీందర్ ఖోసాకు ఫోన్ చేశాడు. తనను తాను ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ మీషూ ధీర్గా పరిచయం చేసుకున్నాడు. తన కుటుంబం చిక్కులో పడిందని, తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఏసీపీ ఖోసాకు ఆదేశించారు. తనకున్న 8 మంది భద్రతాసిబ్బంది ఢిల్లీలో ఉండిపోయారని, అమృత్సర్లో ఉన్న తన తల్లికి భద్రత అవసరమని చెప్పాడు. రాత్రి వేళ పెట్రోలింగ్ జరగడం లేదని కూడా ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా మాజీ సీపీ అరుణ్పాల్ సింగ్తో పాటు పలువురు సీనియర్ పోలీసుల పేర్లు లేవనెత్తాడు. ఇలా మాట్లాడుతుండగానే నకిలీ జడ్జిపై ఏసీపీకి అనుమానం వచ్చి విచారణ చేయ నకిలీ జడ్జిగా తేలింది.
దాంతో పోలీసులు సదరు నకిలీ న్యాయమూర్తి ఇంటిపై దాడి చేయగా.. అతడి వద్ద ఎలాంటి డిగ్రీ కానీ లేదా జడ్జి గుర్తింపు కార్డు కానీ లేదు. నిందితుడి ఇంటి వద్ద పార్క్ చేసిన కారుకు నీలిరంగు బీకాన్ను అమర్చారు. అంతే కాకుండా కారు ముందు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనే నేమ్ ప్లేట్ కూడా బిగించారు. నిందితుడు మీషూపై పోలీసులు ఐపీసీ 420, 467, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.