బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్‌కు చెందిన వర్ధమాన మోడల్ మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర వీడియోలతో ఫేస్బుక్ ఫ్రెండ్ వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలు సుమిత (పేరుమార్పు) తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దివారాల కిందట సుమితకు ఫేస్బుక్లో సోనియా పర్నదిస్ అనే పేరుతో మహిళ పరిచయమైంది.
తాను మోడల్‌నని చెప్పుకున్న పర్నదిస్ మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ ఫోటోలు, వీడియోలు పంపాలని సుమితను కోరింది. తనకు పని దొరుకుతుందనే ఆశతో సుమిత ఆమె చెప్పినట్టే ఫోటోలు, వీడియోలు పంపగా కొద్దిరోజులకే మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోలను సుమితకు పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగింది. నగ్న వీడియోలు పంపకుంటే వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.