Drugs @ Gujarat | ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఒకరిని అరెస్ట్ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. ఆయన నుంచి రూ.1.80 కోట్ల విలువ చేసే మత్తుపదార్థాలను స్వాధీన పర్చుకున్నారు. అదేవిధంగా నిందితుడి నివాసం నుంచి రూ.4.05 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్లోని సూరత్ నగరంలోని పాండేసర ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో నిషేధిత మెఫోడ్రోన్ అనే మత్తు మందు దాచినట్లు అందిన సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి జరిపారు. 24 ఏండ్ల ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి ఫ్లాట్ నుంచి 1.796 కిలోల మెఫోడ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.1.80 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అతడినపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల క్రితమే సూరత్ పోలీసులు కేజీ బంగారం బిస్కెట్లతోపాటు రూ.68 లక్షల నగదుతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. గుజరాత్లో డ్రగ్స్ పెరిగిపోతున్నదన్న వార్తలకు ఈ అరెస్ట్ బలం చేకూరుస్తున్నది.
కోస్తా తీర రాష్ట్రమైన గుజరాత్లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు నిరంతరం సరఫరా అవుతున్నాయి. పంజాబ్ తరహాలో ఇక్కడ కూడా సరిహద్దుల నుంచి డ్రగ్స్ పెద్దఎత్తున రవాణా అవుతున్నది. గత నెలలో భారత తీర రక్షక దళం, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఒక పాకిస్తానీ బోటును అడ్డుకున్నాయి. బోటులో దాదాపు 50 కిలోల డ్రగ్స్ లోడ్ చేయగా, దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.350 కోట్లు. బోటులో ఉన్న ఆరుగురిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది.