New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలోని హనుమాన్ మూర్తి చౌక్ వద్ద జరిగింది.
25 మంది ప్రయాణికులతో జైపూర్ నుంచి వస్తున్న బస్సు అతివేగం కారణంగా అదుపుతప్పి, బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. అర్ధరాత్రి దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు అక్కడికి చేరుకుని బాధితుల్ని రక్షించే చర్యలు చేపట్టారు. బోల్తా పడ్డ బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికుల్ని బయటకు తీశారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. చీకట్లో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ బాధితుల్ని బయటకు తీసి, క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు. ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రులైన సర్ గంగారం హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్కు బాధితుల్ని తరలించారు.
వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా ఇద్దరు మరణించారు. డ్రైవర్ వేగ నియంత్రణపై పట్టుకోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.