న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో విదేశీ మహిళలతో పరిచయం పెంచుకుని వారికి మాయమాటలు చెబుతూ నగ్న చిత్రాలు, వీడియోలను పంపాలని బ్లాక్మెయిల్ చేస్తున్న యువకుడి (21)ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుంగుబాటు, యాంగ్జైటీతో బాధపడే విదేశీ మహిళల ప్రొఫైల్స్‌తో కూడిన టాక్ లైఫ్ యాప్ ద్వారా నిందితుడు మహిళలకు గాలం వేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఇండోనేషియా మహిళ చేసిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా నిందితుడి బాగోతం వెల్లడైంది.
ఢిల్లీకి చెందిన భరద్వాజ్ టాక్ లైఫ్ యాప్‌లో కుంగుబాటు, ఆర్ధిక సమస్యలతో బాధపడే మహిళలతో పరిచయం పెంచుకున్నాడు. నిందితుడికి ఇండోనేషియా మహిళ పరిచయం కావడంతో ఆపై ఇద్దరూ వాట్సాప్‌లో చాట్ చేసుకునేవారు. ఆమె ఆర్ధిక పరిస్థితి బాగా లేదని గ్రహించిన భరద్వాజ్ తనకు నగ్న చిత్రాలు, వీడియోలు పంపితే నెలకు 300 యూఎస్ డాలర్ల డబ్బు ఇస్తానని నమ్మబలికాడు. ఆర్ధిక అవసరాల కోసం మహిళ పలు వీడియోలు పంపగా డబ్బు పంపకపోగా మరికొన్ని వీడియోలు, ఫోటోలు పంపకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
మహిళ ఫిర్యాదు మేరకు కాల్ రికార్డులు, మొబైల్ నెంబర్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్ లోకంగా బతికే భరద్వాజ్ ఒంటరిగా గంటలతరబడి రూంలో గడిపేవాడని పోలీసులు వెల్లడించారు. కుమారుడితో తాను ఆరేండ్ల నుంచి మాట్లాడటం లేదని ఆయన తండ్రి వెల్లడించారు. కాగా 15 మంది విదేశీ మహిళలతో పరిచయం పెంచుకున్న నిందితుడు ముగ్గురు మహిళల నుంచి నగ్న చిత్రాలు, అశ్లీల వీడియోలను రాబట్టాడని పోలీసులు వివరించారు. నిందితుడి మొబైల్ ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు.