న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై టీచర్ అతి కిరాతకంగా ప్రవర్తించారు. విద్యార్థినిపై కత్తితో దాడి చేసి, మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ నగర్ నిగమ్ బాలికా విద్యాలయలో వందన అనే చిన్నారి ఐదో తరగతి చదువుతోంది. అయితే ఇవాళ ఉదయం 11:15 గంటల సమయంలో టీచర్ గీతా దేశ్వాల్.. వందనను మందలించింది. ఆ తర్వాత చిన్నారిపై కత్తెరతో దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. బాధిత విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసింది.
విద్యార్థినిపై దాడిని తోటి టీచర్ రియా అడ్డుకోబోయింది. అయినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న చిన్నారిని చికిత్స నిమిత్తం బారా హిందూ రావు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. టీచర్ గీతా దేశ్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.