అల్వాల్ జూలై 25 (నమస్తే తెలంగాణ) : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వేణు (Venu) అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూటీపై వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అతడు మరణించాడు. మచ్చ బొల్లారం డివిజన్ గోపాల్ నగర్లో నివసించే యాదగిరి, రేణుక దంపతుల కుమారుడు వేణు. అతడు అల్వాల్‌లోని వందనా కళాశాలలో డిగ్రీ బీకాం చదువుతున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం వేణు స్కూటీ పైన అల్వాల్ పైపు వస్తుండగా.. లోతుకుంట ప్రభుత్వ పాఠశాల వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదలో తీవ్ర గాయాల పాలైన వేణు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై ఉన్నవిద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.