Madgulapally : అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. మాడుగులపల్లి మండలంలోని కుక్కడం సెంటర్ లో మిర్యాలగూడ నుంచి నల్గొండ వైపు వెళ్తున్న ఓ స్కూటీని వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి తలపైనుంచి డీసీఎం వ్యాన్ వెళ్లింది. అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ తలపై నుంచి వాహనం వెళ్లడం వల్ల అక్కడే మరణించాడు.
దీంతో స్కూటీపై ఉన్న వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.