పెద్దేముల్ : అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న వేళ గుర్తు తెలియని దొంగలు ఓ ఇంట్లో దూరి బ్యాగులో కిరాణ కొట్టు గళ్లలో దాచిన రూ. లక్ష 25వేల పై చిలుకు నగదును, ఓ స్మార్ట్ ఫోన్‌ను దొంగిలించిన సంఘటన గురువారం మండల కేంద్రంలో పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ నారాయణ బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కందనెల్లి సత్యనారాయణ వృత్తి రీత్యా పాల వ్యాపారం చేసుకుంటూ ఇంటి వద్ద కిరాణ కొట్టును నడిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.
మరోవైపు పాత ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా పాత ఇంటిలో ఓ గదిని అలాగే ఉంచి మిగతా భాగం నూతన ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు. ఇంటి నిర్మాణంలో భాగంగా ఇసుక, కంకర, సిమెంట్ కోసం ఇంట్లో కొంత నగదును, వ్యాపారంలో వచ్చిన కొంత నగదును, కిరాణ కొట్టులో అయిన గిరాకీ నగదును ఇంట్లో దాచి ఉంచాడు. అయితే బుధవారం సత్యనారాయణ రోజు మాదిరి రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్థరాత్రి వేళ గుర్తు తెలియని దొంగలు ఇంట్లో దూరి బ్యాగులో దాచిన, కిరాణ కొట్టు గళ్లలో దాచిన రూ. లక్ష 25వేల పై చిలుకు నగదును అపహారించుకు పోయారు. ఉదయం నిద్రలేచి చూసే సరికి పాత ఇంటి ఓ తలుపు తీసివేసి ఉండి, ఇంట్లో సామాన్లు చెల్ల చెదురుగా పడి ఉన్నాయి.
గమనించిన సత్యనారాయణ ఇంట్లో దాచిన సొత్తును పరిశీలించుకోగా దొంగలు సొత్తును అపహారించుకుపోయారని నిర్థారించుకుని గురువారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఏఎస్ఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని ఇంటిని, పరిసరాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. అయితే పాత ఇంటి ఒక పక్క ఉన్న డోర్‌ను దొంగలు పైకిలేపి తీసివేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా చిన్న దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న ఓ యువకుడిని పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే స్థానికంగా పెద్దేముల్ పోలీసు స్టేషన్‌కు పర్మినెంట్‌గా ఎస్ఐ లేకపోవడం, రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ లేకపోవడం వల్లనే ఈ దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో దొంగతనం జరుగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగంగా చేపడుతున్నట్లు ఏఎస్ఐ నారాయణ తెలిపారు.