కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గొడవ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు. వాళ్లు గొడవ చేస్తుండటం చూసిన వధువు తల్లి.. అక్కడకు చేరుకుంది. ఆ ఇద్దర్నీ డ్యాన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేసింది. దాంతో కోపం తెచ్చుకున్న వాళ్లు కత్తులతో ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. ఘేస్ ప్రాంతంలోని బాడ్మల్ గ్రామానికి చెందిన ఒక యువకుడితో తన కుమార్తె వివాహాన్ని నిశ్చయం చేసింది కిషోరీ రాఝాన్స్ అనే మహిళ.
పెళ్లి కూతురిని తీసుకొని బ్యాండ్ మేళంతో అత్తారింటికి తీసుకెళ్తోందా కుటుంబం. ఈ క్రమంలో చుట్టుపక్కల వాళ్లు కూడా కలిసి డ్యాన్సులు చేస్తూ వధువును అత్తగారి ఊరికి తీసుకెళ్తున్నారు. దారి మధ్యలో డ్యాన్సులు చేస్తున్న సుమంత్ నాయక్, సుబోధ్ రాఝాన్స్ పక్క వారితో గొడవ పడ్డారు. వాళ్లిద్దరూ కిషోరి పొరుగిళ్లలో ఉంటారు. దాంతో ఆమె వచ్చి గొడవ పడొద్దని కోరింది.
వీళ్లదే తప్పని తేలడంతో డ్యాన్సులు చేయకుండా పక్కన ఉండాలని బతిమిలాడింది. దీంతో కోపం తెచ్చుకున్న వాళ్లు పదునైన వస్తువులతో ఆమెపై దాడి చేశారు. వెంటనే కిషోరిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సుబోధ్, సుమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.