గాలిపటాల సీజన్ వచ్చిందంటే చాలు ‘మాంజా’ ప్రమాదాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి నాగ్‌పూర్‌లో కారులో వెళ్తున్న ఒక ఎనిమిదేళ్ల పిల్లవాడు.. కారులో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు.
ఇంతలో గాల్లో ఎగురుతున్న ఒక గాలిపటానికి కట్టిన మాంజా దారం అతని గొంతు కోసేసింది. మంకాపూర్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సదరు పిల్లవాడు కారులో సీటుపై నిలబడి సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చాడని తెలుస్తోంది.
అప్పుడే అటుగా వెళ్లిన గాలిపటానికి కట్టిన మాంజా దారం అతని గొంతు కోసింది. దీంతో కారులో ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లవాడిని దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పిల్లవాడికి చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు.