మొయినాబాద్ : మద్యం మత్తులో కారు నడుపుతూ అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై మొయినాబాద్ సమీపంలోని తాజ్ హోటల్ వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మోర వెంకటేష్ కూతుర్లు ప్రేమిక (16), సౌమ్య, అక్షయ శనివారం రాత్రి 7.30 సమయంలో స్కూటీపై కనకమామిడి వైపు వెళ్తున్నారు.
అదే సమయంలో చేవెళ్ల వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమిక ముక్కులో నుంచి రక్తం వచ్చి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన ఇద్దరిని 108లో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.