మహబూబాబాద్ : జిల్లా కేంద్ర శివారు అయ్యప్పనగర్‌కు చెందిన భూక్య రేణుక-అశోక్ దంపతుల రెండేళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించిన యువతిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జూపల్లి వెంకటరత్నం తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన రాథోడ్ వైష్ణవి అలియాస్ సోని మూడు నెలల క్రితం మహబూబాబాద్‌కు వచ్చి అయ్యప్పనగర్‌లో ఓ రూమును అద్దెకు తీసుకుని నివాసం ఉంటుంది. రోజువారీ కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తోంది. కాగా బుధవారం రేణుక-అశోక్ దంపతుల రెండో కుమారుడు ఒంటరిగా కనిపించడంతో కిడ్నాప్ చేయాలని అనుకుని ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని మాయమాటలు చెప్పి బయటకు తీసుకొచ్చింది.
బాలుడికి శిరోముండనం (గుండు) చేసి రైలులో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. బాలుడు ఇంటి వద్ద కనిపించకపోవడంతో తల్లి రేణుక తండ్రికి సమాచారం అందించింది. దీంతో పట్టణమంతా వెతుకుకుంటూ రైల్వేస్టేషన్‌లోనూ వెతకుతుండగా బాలుడు శిరోముండనంతో (గుండు గీయించి) కనిపించాడు. విషయం తెలుసుకున్న రేణుక పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైష్ణవిని స్టేషన్‌కు తరలించారు. బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం వైష్ణవిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటరత్నం తెలిపారు.