రాంచీ : ఆహారం విషయంలో తలెత్తిన వివాదం హత్య దాకా దారి తీసింది. ఓ ఇద్దరు దంపతులను పనోడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ గుమ్లా జిల్లాలోని మజ్గావ్ జాంతోలి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జాంతోలి గ్రామానికి చెందిన రిచర్డ్, మెలానీ మింజ్ అనే దంపతులు తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. అయితే వీరి అవసరాల నిమిత్తం సత్యేంద్ర లక్రా(40) అనే పనోడిని నియమించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆహారం విషయంలో రిచర్డ్‌కు, సత్యేంద్రకు మధ్య వివాదం తలెత్తింది. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న సత్యేంద్ర.. సమయం కోసం ఎదురుచూశాడు. సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రిచర్డ్, మెలానీతో పాటు కూతురిపై గొడ్డలితో దాడి చేశాడు.
దంపతులపై గొడ్డలితో విచక్షణారహితంగా నరకడంతో.. వారు అక్కడికక్కడే చనిపోగా, కూతురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రిచర్డ్ కుమారుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఇక కుమారుడు గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు అప్రమత్తమై సత్యేంద్రను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించారు. దంపతులను నరికిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.