న్యూఢిల్లీ: సహ ఉద్యోగులపై ఒక పోలీస్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హైదర్‌పూర్ ప్రాంతంలోని వాటర్ ప్లాంట్‌లో సిక్కిం పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే గొడవ నేపథ్యంలో ఒక సిక్కిం పోలీస్ తన సహచరులపై గన్‌తో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు పోలీసులు చనిపోగా మరొకరు గాయపడ్డారు. గాయపడిన పోలీస్‌ను అబేద్కర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కాల్పులు జరిపిన నిందితుడు ఢిల్లీ పోలీసులకు సరెండర్ అయ్యాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఇలాంటి సంఘటన జరిగింది. ఉదంపూర్ జిల్లాలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్ శనివారం తన ముగ్గురు సహచరులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు గాయపడ్డారు. అనంతరం ఆ జవాన్ తనను తాను గన్‌తో కాల్చుకోవడంతో అతడు చనిపోయాడు.