ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు (Cyber Fraud) విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకో తరహా స్కామ్‌తో రూ. లక్షలు కొట్టేస్తున్న స్కామర్లు ఈసారి ఏకంగా కోట్లనే కొల్లగొట్టారు. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తామని మభ్యపెడుతూ ముంబైకి చెందిన ఓ కంపెనీని రూ. 2.5 కోట్లకు బురిడీ కొట్టించారు. ముంబైకి చెందిన ఓ హెల్త్‌కేర్ కంపెనీ ఇన్వెస్టర్ కోసం అన్వేషించే క్రమంలో రెండున్నర కోట్లు మోసపోయింది. పెట్టుబడి కోసం సింగపూర్ కంపెనీతో సదరు కంపెనీ సంప్రదింపులు జరుపుతుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి తాను అంతర్జాతీయ కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ అని చెప్పుకుంటూ ఎంట్రీ ఇచ్చాడు.
కాంట్రాక్ట్‌పై ముందుకెళ్లేందుకు వివరాలు అందించాలని స్కామర్ బాధితులకు ఓ లింక్ పంపాడు. ఇది ఫిషింగ్ లింక్ కావడంతో బాధితులు లింక్‌ను క్లిక్ చేయగానే కంపెనీ భారీ మొత్తం నష్టపోయింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన హెల్త్ కేర్ కంపెనీ చార్టర్డ్ అకౌంటెంట్ తన కంపెనీకి ఇన్వెస్టర్ల గురించి అన్వేషిస్తుండగా సింగపూర్‌కు చెందిన ఖైబర్ వెంచర్స్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి సీఏతో ఈ-కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. రూ. 2.5 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ఖైబర్ వెంచర్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఈ మొత్తాన్ని ముంబైకి చెందిన కంపెనీ క్రిప్టోకరెన్సీ వాలెట్లో డిపాజిట్ చేసింది. ఈ క్రమంలో స్కామర్ పంపిన ఫిషింగ్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఖైబర్ వెంచర్స్ డిపాజిట్ చేసిన మొత్తంతో పాటు ముంబై కంపెనీలోని డబ్బు రూ. 2.20 కోట్లను గుర్తుతెలియని వ్యక్తులు దారిమళ్లించారు. తమ ఖాతాలో డబ్బు విత్‌డ్రా కావడంతో సీఏ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా స్కామర్లు ఇన్ఫెర్నో డ్రైనర్ టూల్స్‌ను ఉపయోగించి ఈ దాడికి తెగబడిఉంటారని అనుమానిస్తున్నారు.
Read More :