ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడ మండలం గుండాలలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా బుధవారం ఇరు వర్గాల మధ్య గొడవ ప్రారంభమైంది.
ఓ వర్గం వారు గోడ్డళ్లు, రాళ్లు, కట్టెలతో ప్రత్యర్థి వర్గం పై విచక్షణారహితంగా దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గాయపడిన వారిని అదిలాబాద్ రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.