కామేపల్లి: ఓ వ్యక్తి విలేకరి ముసుగులో పలువురు రైతులను బ్యాంకు రుణాల పేరుతో బురుడీకొట్టించి లక్షల్లో నగదు వసూలు చేశాడు. కామేపల్లి మండలంలో ఓ పత్రికలో పనిచేస్తున్న శ్రీనివాస్ కొంతమంది రైతులకు అగ్రికల్చర్ లోన్లు ఇప్పిస్తానని నమ్మబలికి అందుకు తనకు ముందుగా కొంత నగదును ఇవ్వాలని కోరడంతో మొదటి విడతగా కొంత నగదును ముట్టచెప్పడం జరిగిందని, తర్వాత విడత వారీగా తమ వద్ద నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడని తెలిపారు. ఈ క్రమంలో రెండేళ్ళ క్రితం నుంచి నాగమణి నుంచి రూ.4 లక్షల50వేలు,నాగేశ్వరరావు నుంచి రూ.45 వేలు పలు దఫాల్లో వసూలు చేశాడని బాధితులు తెలిపారు.
నాగేశ్వరావు తనకు ఎటువంటి లోన్లు వద్దని తిరిగి తన డబ్బును తనకు ఇవ్వాలని కోరడంతో రూ.11 వేలు మాత్రమే ఇచ్చాడని మిగతా సొమ్ము ఇవ్వలేదన్నారు. లోన్ల విషయం గురించి పలుమార్లు అడిగినా స్పందించడం లేదని, దీంతో తాము మోసపోయామని ఆలస్యంగా గుర్తించామని తెలిపారు. విలేకరిగా పని చేస్తున్నానని తనకు అధికార్లు తెలుసని,లక్షల్లో లోన్లు వచ్చే అవకాశం ఉందని ఆశ చూపడంతో తాము నిజమేనని నమ్మి మోసపోయామని,జరిగిన విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని, లోన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.