హైదరాబాద్ : వనస్థలిపురం పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అయితే కారులో ఉన్న ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఉన్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు.
అయితే కారులో ఉన్న ఇద్దరు యువకులు.. పోలీసులు వచ్చేలోపు అక్కడ్నుంచి జారుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు అతి వేగంగా వచ్చి దుకాణాలపై దూసుకెళ్లిందని స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.