ముంబై : గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడేందుకు అడ్డుపడుతున్నాడనే ఆగ్రహంతో ఆమె తండ్రిపై కత్తితో దాడి చేసిన యువకుడి (19) ఉదంతం మహారాష్ట్రలోని భివాండిలో వెలుగుచూసింది. కూతురి బాయ్‌ఫ్రెండ్ కత్తితో దాడి చేయడంతో బాధితుడు మహ్మద్ అన్సారీ(49)కి తీవ్రగాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్సారీ బుధవారం రాత్రి తన స్నేహితుడితో కలిసిఉండగా నిందితుడు అర్బాజ్ ఖాన్ అతడితో మాట్లాడేందుకు అక్కడికి వచ్చాడు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తన కుమార్తె, మేనకోడలి వెంటపడటం మానుకోవాలని అన్సారీ నిందితుడిని హెచ్చరించాడు. దీంతో రెచ్చిపోయిన అర్బాజ్ ఖాన్ కత్తితో అన్సారీపై దాడి చేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న అన్సారీని స్ధానికులు కాపాడగా నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని దవాఖానకు తరలించి నిందితుడు అర్బాజ్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు.