ముంబై : 2013లో ముంబైలోని శక్తి మిల్స్‌లో ఫోటో షూట్ కోసం ఓ వ్యక్తితో కలిసి వెళ్లిన 22 ఏండ్ల ఫోటో జర్నలిస్ట్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు దోషులకు కిందికోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు గురువారం పక్కనపెట్టింది. ప్రజాగ్రహం ఆధారంగా తీర్పును వెలువరించలేమని స్పష్టం చేసింది. శక్తి మిల్ సామూహిక లైంగిక దాడి కేసు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని..లైంగిక దాడి బాధితురాలు శారీరకంగానే కాకుండా మానసికంగా తీవ్ర వేదన అనుభవించిందని, ఇది మానవ హక్కులపై దాడి అని కోర్టు పేర్కొంది. అయితే కేవలం ప్రజాగ్రహం తీర్పు ను ప్రభావితం చేయరాదని వ్యాఖ్యానించింది.
నిందితులు తమ మిగిలిన జీవితమంతా జైలులో గడపాలని, ఈ క్రమంలో వారికి పెరోల్ జారీ చేయరాదని వారికి యావజ్జీవ ఖైదు విధించింది. 2013లో ఓ వ్యక్తితో కలిసి శక్తి మిల్స్‌కు ఫోటో షూట్ కోసం యువతి వెళ్లగా అతడిని చెట్టుకు కట్టేసిన అయిదుగురు నిందితులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురు మరో సామూహిక లైంగిక దాడి కేసులోనూ దోషులుగా తేలడం గమనార్హం.
బాధితురాలిపై విజయ్ జాదవ్, మహ్మద్ ఖాసిం బెంగాలి, మహ్మద్ సలీం అన్సారీ, సిరాజ్ రెహ్మీన్ ఖాన్, ఆకాష్‌లు ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరిలో ఆకాష్ నేరం జరిగిన సమయంలో మైనర్ కాగా 2014 మార్చిలో జాదవ్, బెంగాలీ, అన్సారీలకు ముంబై సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఖాన్‌కు యావజ్జీవ ఖైదు విధించిన కోర్టు జువైనల్ జస్టిస్ బోర్డు దోషిగా నిర్ధారించిన మీదట ఆకాష్‌ను దిద్దుబాటు కేంద్రానికి తరలించారు.