Blackmail | తను పని చేస్తున్న క్లినిక్‌లో డాక్టర్‌ను బ్లాక్మెయిల్ చేసిందో లేడీ కాంపౌండర్. డాక్టర్ తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉండగా రహస్యంగా వీడియో తీసి, ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే దాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబైలో స్థానికంగా ఒక క్లినిక్ నడుపుతున్న మహిళా డాక్టర్‌కు పెళ్లయిపోయింది. అయితే ఇటీవల ఒమన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తితో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయం క్లినిక్‌లో పనిచేస్తున్న లేడీ కాంపౌండర్‌కు తెలుసు. దీన్ని అదనుగా తీసుకున్న కాంపౌండర్ ఒక స్పైక్యామ్ తీసుకొచ్చి క్లినిక్‌లో అమర్చింది.
ఎవరూ లేనప్పుడు డాక్టర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ అన్యోన్యంగా ఉన్న వీడియోలు ఆ కెమెరాలో రికార్డయ్యాయి. వీటిని తన సహచరుడికి పంపిన కాంపౌండర్.. సదరు డాక్టర్‌కు బ్లాక్మెయిల్ చేయించడం ప్రారంభించింది. తమకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, డాక్టర్ కుటుంబానికి పంపుతామని నిందితులు బెదిరించారు.
ఈ క్రమంలో ఏం చేయాలో తోచన డాక్టర్.. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించింది. వారి సలహా మేరకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి లేడీ కాంపౌండర్‌ను తన వద్దకు పిలిపించింది. అక్కడ పోలీసులు ఆమెకు వల వేశారు. కానీ ఈ విషయం తెలుసుకున్న ఆ నిందితురాలు.. వీడియోలను డాక్టర్ స్నేహితురాలికి పంపింది.
ఈ సమయంలోనే ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ ద్వారా కాంపౌండర్‌కు సహకరించిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు.. అతన్ని ఘట్కోపర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి కెమెరా, మెమరీ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.