లక్నో : బీజేపీ ఎమ్మెల్యే ఛోటె లాల్ వర్మ, ఆయన కుమారుడు లక్ష్మీ కాంత్ వర్మలపై ఆగ్రా పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు లక్ష్మీకాంత్ వర్మ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ (37) ఫిర్యాదు ఆధారంగా ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాను ఫతేహబాద్ ఎమ్మెల్యే ఛోటే లాల్ కూతురు స్నేహితురాలినని ఆమెను కలుసుకునేందుకు 2003లో 17 ఏండ్ల వయసున్నప్పటి నుంచి ఎమ్మెల్యే ఆగ్రా నివాసానికి వచ్చి వెళుతుంటానని బాధితురాలు తెలిపారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే కుమారుడు లక్ష్మీ కాంత్ వర్మతో పరిచయం కాగా ఆయన ఓరోజు తన నివాసానికి పిలిపించాడని చెప్పారు. మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో మహిళ ఆరోపించారు. నేరాన్ని వీడియోలో రికార్డు చేసిన ఎమ్మెల్యే కుమారుడు చంపేస్తానని బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు.
తనను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడని, కొన్నేండ్ల తర్వాత ఓ ఆలయంలో పెండ్లి చేసుకుని ఆపై పలుమార్లు అబార్షన్ చేయించాడని ఆరోపించారు. 2006లో తాను జలంధర్ వెళ్లగా మరో యువతిని పెండ్లి చేసుకున్నాడని చెప్పారు. విడాకుల పత్రాలపై సంతకాలు చేయాలని అప్పటినుంచి ఎమ్మెల్యే కుమారుడు ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఎమ్మెల్యే కుమారుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.