Bengaluru : విద్య నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలవాల్సిన లెక్చరర్లు, ప్రిన్సిపల్ కలిసి ఒక విద్యార్థిని వేధించారు. దీంతో డాక్టర్ కావాల్సిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. కలర్, ముఖం బాగా లేదని వేధించడంతో తనువు చాలించింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. చందపుర, హెడ్ మాస్టర్ లే ఔట్ కు చెందిన బి.యశస్విని (23) అనే యువతి బెంగళూరులోని ద ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజీలో ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ విభాగంలో చదువుకుంటోంది.
అయితే, ఆమెను అక్కడి లెక్చరర్లు, ప్రిన్సిపల్ కలిసి మానసికంగా వేధించారు. అనేకసార్లు అవమానపరిచారు. తన రంగు, ముఖం, వస్త్రధారణ సరిగ్గా లేదని తిట్టేవారు. ఈ ముఖంతో డాక్టర్ అవుతావా అంటూ పలుసార్లు వేధించేవారు. తరగతి గదిలోనే ఇలా చాలాసార్లు వేధించారు. అలాగే యశస్విని సెమినార్లు ఇవ్వకుండా, కేస్ వర్క్ ఇవ్వకుండా, ఇంటర్నల్ మార్కుల విషయంలో కూడా వేధించారు. మరోవైపు ఇటీవల యశస్విని కంటి సమస్యతో ఇబ్బంది పడింది. దీంతో ఆమెకున్న ఈ సమస్యను కూడా హేళన చేస్తూ గత వారం క్లాస్ రూంలో లెక్చరర్లు తిట్టారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యశస్విని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సూసైడ్ నోట్ కూడా రాసింది. కానీ, అందులో ఎవరి పేర్లూ రాయలేదు.
కానీ, పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి విచారణ చేయగా.. ఈ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. యశస్వినిని లెక్చరర్లు, ప్రిన్సిపల్ కలిసి వేధించేవారని తోటి స్టూడెంట్స్ చెప్పారు. దీంతో స్పందించిన కాలేజీ యాజమాన్యం ఇందుకు కారణమైన ఆరుగురు లెక్చరర్లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని మేనేజ్ మెంట్ ప్రకటించింది.