అమరావతి : విశాఖ ఆర్కే బీచ్‌లో గల్లంతైన ముగ్గురిలో ఆఖరి మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన తరువాత గజ ఈతగాళ్ల సహాయంతో చేపట్టిన గాలింపు చర్యలో 24 గంటల అనంతరం అజీజ్ మృతదేహం లభించింది . హైదరాబాద్‌కు చెందిన 8మంది యువకులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సరదా కోసం విశాఖ ఆర్కే బీచ్‌కు వెళ్లగా వీరిలో ముగ్గురు ఆదివారం సాయంత్రం స్నానం చేస్తు గల్లంతైన విషయం తెలిసిందే.
వీరు స్నానం చేస్తుండగా వచ్చిన భారీ అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా గమనించిన తోటి స్నేహితుల అరుపులతో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు సీహెచ్ శివను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కొన ఊపరితో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు కే. శివకుమార్, అజీజ్ ఆచూకీ కోసం గాలించగా అప్పటికే చీకటి పడడంతో సహాయక చర్యలను నిలుపుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన సహాయక చర్యల్లో మద్యాహ్నాం కోట శివ మృతదేహం దొరకగా అజీజ్ మృతదేహం కోసం విస్తృతంగా గాలించారు. చివరకు గాలింపు చర్యలో అజీజ్ మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు.