ఖమ్మం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని ఖమ్మం టౌన్ ఏసీపీ ఆంజనేయులు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా స్ధానికుల భాగస్వామ్యంతో ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహీర్ పురలో ఏర్పాటు చేసిన ఐదు సీసీ కెమెరాలను టౌన్ ఏసీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు ప్రధాన రహదారులే కాకుండా అన్నివీధులూ సీసీటీవీల నిఘా ఉంటుందని తెలిపారు.
నేరస్తులు కూడా కొత్త తరహా పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ పక్క నేరాలను అదుపు చేయడం, మరో పక్క నేరాలు జరగకుండా ప్రజల పారదర్శక జీవనానికి సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు. అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు, ఏ చిన్న నేరం జరిగినా గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో సహకరిస్తాయని అన్నారు.
కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగస్వామ్యమై ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ సర్వయ్య, ఎస్సై శ్రావణ్, స్థానిక కార్పొరేటర్ సరస్వతీ, తదితరులు పాల్గొన్నారు.