కొన్ని సార్లు వాస్తవాలు మనం చదివే కథల కన్నా వింతగా అనిపిస్తాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కొంతకాలం క్రితం ‘‘మీ భర్తను ఎలా చంపాలి?’’ అనే పుస్తకం రాసిన ఒక రచయిత్రి.. ఇప్పుడు భర్తను చంపిన కేసులో అరెస్టయింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన నాన్సీ క్రాంప్టన్ బ్రాఫీ (71).. ‘‘రాంగ్ నెవర్ ఫెల్ట్ సో రైట్ (తప్పు ఎప్పుడూ ఇంత మంచి అనిపించలేదు)’’ అనే పేరుతో కొన్ని నవలలు రాసింది.
వాటిలో ‘‘ది రాంగ్ హస్బెండ్’’, ‘‘ది రాంగ్ లవర్’’ వంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని, దాంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త డానియల్ బ్రాఫీని చంపేసిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన భర్తను తాను చంపలేదని ఆమె వాదిస్తోంది. ప్రముఖ ఈకామర్స్ వెబ్సైట్ ‘ఈబే’లో ఆమె ఒక గన్ బ్యారెల్ కొనుగోలు చేసింది. ఆమె భర్త హత్య తర్వాత అది కనిపించకుండా పోవడం కూడా ఆమెపై అనుమానాలకు తావిస్తోంది.
దాంతోపాటు సరిగ్గా డానియల్ హత్య జరిగే సమయానికి, అతను పనిచేసే స్కూల్ దగ్గర నాన్సీ ట్రక్ కనిపించింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అయితే తను అక్కడకు వెళ్లినట్లు తనకు గుర్తులేదని ఆమె చెప్పింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆమె.. భర్త పేరిట ఉన్న చాలా ఇన్సూరెన్సులు కడుతూనే ఉందని, ఆ డబ్బు కోసమే ఈ హత్య చేసి ఉండొచ్చని ప్రాసిక్యూటర్ లాయర్ అంటున్నారు. అయితే తను కొనుగోలు చేసిన బ్యారెల్ కూడా ఒక పుస్తకం రాయడం కోసమేనని, తను ఎవర్నీ చంపలేదని నాన్సీ వాదిస్తోంది.