ముంబై : క్రూయిజ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, ఏడుగురు ఇతర నిందితులను ఆర్ధర్ రోడ్ జైలుకు తరలించనున్నారు. నిందితులను గురువారం రాత్రి ఎన్సీబీ కార్యాలయంలో ఉంచారు. నిందితులను మరికొద్ది రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని ఎన్సీబీ అధికారుల వినతిని కోర్టు తోసిపుచ్చింది. ఆర్యన్ ఖాన్ కస్టడీ విచారణ అవసరం లేదని ముంబై కోర్టు పేర్కొంది.
మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించాలని ఆర్యన్ ఖాన్ న్యాయవాది సతీష్ మనెషిండే కోర్టుకు విజ్ఞప్తి చేయగా బెయిల్ దరఖాస్తును ప్రత్యేక న్యాయస్ధానం విచారణ చేపడుతుందని మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది. ఖాన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఎన్సీబీని ఆదేశించింది. కాగా ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్లో జరిగిన రేవ్ పార్టీపై ఆదివారం ఎన్సీబీ చేపట్టిన దాడుల్లో ఆర్యన్ ఖాన్ సహా ఎనమిది మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి పెద్దమొత్తంలో మత్తుపదార్ధాలను ఎన్సీబీ అధికారులు సీజ్ చేశారు.