సూర్యాపేట : పెద్ద ఎత్తున కల్తీ టీ పొడిని విక్రయిస్తున్న ముఠా గుట్టును సీసీఎస్, పట్టణ పోలీసులు రట్టు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ వివరాలను వెల్లడించారు.
సూర్యాపేట పట్టణంలో ప్రాణాంతకమైన కల్తీ టీ పొడి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారన్నారు. సూర్యాపేట పట్టణంతో పాటు ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, రావులపాలెంలలో దాడులు చేసి నకిలీ టీ పొడి విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారని ఎస్పీ తెలిపారు.
45.5 క్వింటాళ్ల కల్తీ టీపొడిని, ప్రాణాంతకమైన టార్టాజిన్ రసాయన రంగు పొడిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. 22.5 లక్షలు ఉంటుందన్నారు. సూర్యాపేట పట్టణంలో ఈ దందా చేస్తున్న రాచకొండ అనిల్, పోకల రమేష్, బూర్ల వినయ్ కుమార్, ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన సర్వేమ శ్రీనివాస్, రాజమండ్రికి చెందిన కృష్ణ చైతన్య, జగన్నాథం, వెంకటరెడ్డి విజయవాడకు చెందిన కామేశ్వరరావును అరెస్ట్ చేశామన్నారు.
నిందితుల వద్ద నుంచి రెండు కార్లు, 15 సెల్ ఫోన్లు, పాత్రలు, గ్యాస్ సిలిండర్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించిన సీపీఎస్ సీఐ నర్సింహా, సిబ్బంది, పట్టణ సీఐ ఆంజనేయులు, సిబ్బందికి అభినందనలు తెలియజేసి రివార్డులు అందజేశారు.
ప్రమాదకరమైన కల్తీ వస్తువులు ఎవరైనా అమ్మితే సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితి రాజ్, డీఎస్పీ మోహన్ కుమార్, సీఐ లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన లారీ..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్ల విధ్వంసం
Hyderabad | భర్తకు మద్యం తాగించి భార్యపై హత్యాచారం