చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ పిల్లాడికి ఇద్దరు మంచి స్నేహితులు.
రాజకీయ నేత దంపతులు ఇంట్లో లేని సమయంలో ఇద్దరు పిల్లలు.. తమ స్నేహితుడితో ఆడుకోవడానికి వచ్చారు. వాళ్లు అలా ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటారు. అలాగే ఆడుకునే క్రమంలో కప్‌బోర్డులో ఉన్న తుపాకీ తీసుకున్న నేత కుమారుడు.. ఆడుకుంటూనే పదకొండేళ్ల తన స్నేహితుడిని కాల్చి చంపేశాడు.
తుపాకీ చప్పుడు విని స్థానికులు ఆ ఇంట్లోకి వెళ్లి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్న బాలుడు కనిపించాడు. అతని ఎదురుగా చేతిలో తుపాకీతో నిలబడి ఉన్న నేత కుమారుడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. హుటాహుటిన గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఈ ఘటన జరిగే సమయంలో మూడో అబ్బాయి మంచం కింద దాక్కొని ఉన్నాడు.