న్యూఢిల్లీ : సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు, పోకిరీలు చెలరేగుతున్నారు. ఏసీ మెకానిక్ సోషల్ మీడియా వేదికల్లో మహిళగా పరిచయం చేసుకుని బాలికలు, యువతులను అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పంపేలా ప్రేరేపిస్తున్నాడు. యూపీలోని లక్నోలో తన ఇంటి నుంచే నిందితుడు ఈ నిర్వాకానికి పాల్పడుతున్నాడు.ఆగస్ట్ 27న ఓ బాలిక (15) ఫిర్యాదు చేయడంతో నిందితుడు అబ్ధుల్ సమద్ ఆగడాలు వెలుగుచూశాయి.
మైనర్ బాలిక ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్నారు. గుర్తుతెలియని నిందితుడి వివరాలు రాబట్టేందుకు పోలీసులు వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంకు నోటీసులు పంపారు. ఆ వివరాలతో లక్నోలో నిందితుడి నివాసానికి చేరుకున్న పోలీసులు సమద్‌ను అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో మహిళగా పరిచయం చేసుకునే తాను యువతులు, బాలికలతో ముచ్చటిస్తూ వారి అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపమని కోరుతుంటానని విచారణలో నిందితుడు పోలీసులకు తెలిపాడు. నిందితుడు ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఖాతాలను ఓపెన్ చేసి బాలికలు తమ అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు పంపిన తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడని పోలీసులు పేర్కొన్నారు.