ముంబై: భార్యాభర్త ఇద్దరూ సరదాగా కారులో చక్కర్ల కొట్టాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఓ ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని బయలుదేరారు. ఎంజాయ్‌గా రైడ్ చేస్తుండగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై శివార్లలోని ఘట్కోపర్ ఏరియాలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖలాపూర్కు చెందిన మంజు పౌల్ (30), ఆమె భర్త సరదాగా ముంబైని చుట్టి రావాలని అనుకున్నారు. అందుకోసం ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ క్యాబ్ మాట్లాడుకుని బయలుదేరారు. సోమవారం ఉదయం ముంబై శివార్లలోని ఘట్కోపర్ దగ్గర కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో క్యాబ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంజు పౌల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారును తాను నడపడం లేదని, మంజూ పౌల్ భర్తే నడుపుతున్నాడని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. ఆయన నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంవల్లే కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న క్యాబ్‌ను కుడివైపున ఢీకొట్టిందని, దాంతో భర్తకు ఎడమవైపున కూర్చున్న మంజూపౌల్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్ నేరం కింద మంజూ పౌల్ భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.