జైపూర్ : రాజస్ధాన్లో దారుణం జరిగింది. కుటుంబ వివాదం నేపధ్యంలో ఓ వ్యక్తి అత్త, మామలను చంపి ఆపై పోలీసులకు లొంగిపోయిన ఘటన భిల్వారాలో వెలుగుచూసింది. నిందితుడు దేవీలాల్కు మానసిక వైకల్యం ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతులను కంకు దేవి, నారుగా గుర్తించారు. వీరిని నిందితుడు పదునైన ఆయుధంతో హత్య చేసినట్టు వెల్లడైంది.
శనివారం ఉదయం ఐదు గంటల సమయంలో కంకు దేవి తన ఇంటి నుంచి సమీపంలోని పశువుల కొట్టానికి వెళుతుండగా నిందితుడు దాడి చేసి పదునైన ఆయుధంతో పొడిచాడు. ఆమె అరుపులు విని భర్త నారు ఇంటినుంచి బయటకు రాగా ఆయనపైనా నిందితుడు దాడికి పాల్పడ్డాడు. ఘటనా స్ధలంలోనే బాధితులు ఇద్దరూ ప్రాణాలు విడిచారని పోలీసులు తెలిపారు. ఆపై పోలీసులకు నిందితుడే సమాచారం అందించడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.