వెంగళరావునగర్ : అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మంటల్లో కాలి మృతి చెందాడు..ఎర్రగడ్డలోని జిల్లా రిజిస్ట్రార్ భవనం టెర్రస్ పైన ఓ గదిలో బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ముందు అగ్నిప్రమాదంగా భావించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సనత్ నగర్ అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలనార్పే క్రమంలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
ఎస్.ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. ఎర్రగడ్డలోని సబ్ రిజస్ట్రార్ కార్యాలయ భవనం పక్కనే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం భవనం ఉంది. నయీమ్ ఎస్టేట్‌గా పేర్కొనే ఈ నాలుగంత స్ధుల భవనంలో వివిధ వ్యాపార కార్యాలయాలకు అద్దెకిచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ద్విచక్ర వాహనాల సర్వీస్ సెంటర్, పై అంతస్ధుల్లో వివిధ సంస్థలతో పాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. నాలుగో అంతస్ధులో భవనం యజమాని కోడలు, ఆమె ముగ్గురు కుమారులు ఉంటారు.
భవనం యజమాని సయీమ్ నర్సాపూర్‌లోని ఫామ్‌హౌజ్‌లో ఉంటుండగా, ఆయన కుమారుడు విదేశాల్లో ఉంటు న్నాడు. కాగా భవనం టెర్రస్ పై మెట్లను కలిపే చోట ఓ చిన్నగది ఉంది. ఇందులో పాత సామగ్రి, కాగితాలు, ఇతర స్క్రాప్‌ను యజమానులు ఉంచారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో భవనం టెర్రస్ పై నుంచి మంటలను గమనించిన వాచ్మెన్ హుటాహుటిన నీళ్లు చెల్లేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సనత్ నగర్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది భవనం పైకి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పుడే వారికి మంటల్లో కాలిపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమచారం అందించారు.
మిస్టరీగా మారిన కేసు
ప్రమాదం జరిగిన భవనం పైకి తెల్లవారుజామున 3.26 గంటల ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి భవనం పైకి వెళ్లినట్లు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. భవనం వాచ్మెన్ పక్కనే ఉండే మరో వాచ్‌మెన్‌తో కలిసి 7.10 గంటలకు పక్కనే టీ తాగేందుకు వెళ్లినట్లు కూడా కెమెరాల్లో నమోదయ్యింది. వారు తిరిగి వచ్చెప్పటికీ టెర్రస్ పై మంటలు కనిపించాయి.
అయితే చనిపోయిన వ్యక్తి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరన్న చంపి నిప్పుపెట్టారా అనేది మిస్టరీగా మారింది. పోలీసులు ఈ కేసును అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.