New Delhi : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలోని భజన్‌పురలో ఈ నెల 18కి ముందు జరిగినట్లు తెలుస్తోంది. బాధిత చిన్నారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భజన్‌పురలో ఉంటున్న ముగ్గురు మైనర్లు, అదే ప్రాంతంలో ఉంటున్న చిన్నారిని ఒక టెర్రస్‌పైకి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.
తర్వాత చిన్నారి ఇంటికి ఏడుస్తూ, తీవ్ర రక్తస్రావంతో వచ్చింది. తల్లి మొదట అడిగితే.. కింద పడ్డానని, గాయాలయ్యాయని చెప్పింది. అయితే, చిన్నారి ఒంటిపై కింద పడ్డ గాయాలేవీ లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించడంతో ఏడుస్తూ చిన్నారి నిజం చెప్పింది. వెంటనే షాక్‌కు గురైన తల్లి, కుటుంబ సభ్యులు చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి, చిన్నారిని వైద్య చికిత్స, పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్సతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి ఒక్కొక్కరి వయసు 13, 14, 15. దగ్గర్లోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తారు.
బాలిక పరిస్థితి చూసిన ఒక నిందితుడి తల్లి.. తనే కొడుకును పోలీసులకు అప్పగించింది. నిందితులు ముగ్గురిని జువైనల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి కుటుంబ సభ్యులతోపాటు కోరుతున్నారు. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల్ని పరిశీలించడంతోపాటు తగిన ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు.