Mumbai Highway | ముంబై : మహారాష్ట్రలోని ముంబై – నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ వేను గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హైవే రోడ్డుప్రమాదాలకు అడ్డాగా మారింది. ఈ ఆరు నెలల కాలంలోనే పలు ప్రమాదాలు సంభవించగా, 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 143 మంది తీవ్రంగా గాయపడినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ యాక్సిడెంట్లను రోడ్ హిప్నాటిజమ్గా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 11వ తేదీన ఈ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు. 701 కిలోమీటర్ల పొడవున్న ఈ హైవే ముంబై – నాగపూర్ను కలుపుతుంది. ముంబై – నాగపూర్ మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గిస్తుంది. ఈ రెండు నగరాలను ఏడు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు.
ఈ కారిడార్లో డిసెంబర్ 12 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు మొత్తం 358 రోడ్డుప్రమాదాలు జరిగాయి. కాగా 24 రోడ్డుప్రమాదాల్లో 39 మంది మరణించారు. 54 ప్రమాదాల్లో 143 మంది గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇతర రోడ్లపై 43 శాతం యాక్సిడెంట్లు జరిగినట్లు స్పష్టం చేశారు. 2022లో మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15,224 మంది ప్రాణాలు కోల్పోయారు.