రెండు బైక్లను ఢీకొట్టిన లారీ
జాన్పహాడ్ దర్గా శివారులో ఘటన
పాలకవీడు, సెప్టెంబర్ 11 : దైవదర్శనానికి వెళ్లొస్తున్న ముగ్గురిని మృత్యువు లారీ రూపంలో కబళించింది. అతివేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందా రు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం సమీపంలోని జంకుతండాకు చెందిన ధనావత్ పుణ్య (55), ధనావత్ మగ్తి (50) భార్యాభర్తలు. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటకు చెందిన సయ్యద్ జానీ (36) వేర్వేరుగా శుక్రవారం జాన్పహాడ్ దర్శనానికి వెళ్లారు. అనంతరం దామరచర్ల మీదుగా వారి స్వస్థలాలకు వెళ్తుండగా దామరచర ్లనుంచి జాన్పహాడ్కు వెళ్తున్న లారీ దర్గా శివారులో అతి వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ధనావత్ పుణ్య, సయ్యద్ జానీ బైకులను ఢీకొట్టి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సయ్యద్ జానీ, ధనావత్ పుణ్య, అతని భార్య మగ్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శరీర భాగాలు ఛిద్రమై లారీ టైర్ కింద ఇరుక్కొనిపోయాయి. హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి ఘటనా స్థలికి వెళ్లి లారీ కింద ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.