కోల్‌కతా: మోడల్, షార్ట్ ఫిల్మ్ నటి ఆత్మహత్య చేసుకుంది. అవకాశాలు లేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో రాసింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. మోడల్ నుంచి నటిగా మారిన 21 ఏండ్ల బిదిషా దే మజుందార్, బుధవారం సాయంత్రం డమ్‌డమ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ ఇంట్లో ఆత్యహత్యకు పాల్పడింది. ఇంట్లో సీలింగ్‌కు ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను చూసిన పొరుగువారు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లారు. ఆమె ఆత్మహత్యపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మోడల్ బిదిషా మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆర్జీకే ఆసుపత్రికి తరలించారు. ఆమె ఇంట్లో సూసైడ్ నోట్‌ను గుర్తించారు. కెరీర్ అవకాశాలు లేకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది. దీంతో చేతి రాత నిఫుణుల ద్వారా దీనిని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా, బ్రైడల్ మేకప్ ఫొటో షూట్‌తో పాపులర్ అయిన మోడల్ బిదిషా దే మజుందార్, 2021లో ‘భార్ – ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌తో నటిగా రంగప్రవేశం చేసింది. ఈ నెల 15న మరో మోడల్, టీవీ నటి పల్లవి దే కూడా కోల్‌కతాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. పది రోజుల్లోనే మరో బుల్లితెర నటి బలవంతంగా మరణించడం ఆ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.