నిజామాబాద్ : కోతులకు భయపడి చెరువులో దూకిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో చోటు చేసుకున్నది. ఈ సంఘటనలో మరో ఇద్దరిని ఓ యువకుడు రక్షించాడు.
మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం దీపక్ అనే డిగ్రీ విద్యార్థితో కలిసి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు బొల్లి రాజేశ్(12) ఆయన తమ్ముడు హన్మాండ్లు, అఖిలేష్ అలియాస్ లక్కీ(12), అభిలాష్ సాయంత్రం గ్రామ శివారులోని ఊరచెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో కోతులు పెద్ద సంఖ్యలో కనిపించడంతో, పటాకులు పేల్చి వాటిని వెళ్లగొట్టారు.
కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం తిరిగి కోతులు గుంపులుగా రావడంతో భయంతో ఐదుగురు చెరువులోకి దూకారు. ఈత రాకపోవడంతో ముగినిపోతుండగా హన్మాండ్లు, అభిలాష్లను దీపక్ ఒడ్డుకు చేర్చాడు. అనంతరం రాజేష్, అఖిలేష్‌ను తీసుకురావడానికి చెరువులోకి వెళ్లగా అప్పటికే మునిగిపోయారు. అతికష్టం మీద దీపక్ వారిద్దరిని ఒడ్డుకు చేర్చగా రాజేశ్ అప్పటికే మృత్యువాత పడ్డాడు. అఖిలేష్ కొనఊపిరితో ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రాజేశ్, అఖిలేశ్ డిచ్పల్లిలోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. దసరా సెలవులు కావడంతో ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీపక్‌తో పాటు నలుగురు బాలురు దుర్గామాత మాలలు ధరించి ఉన్నారు.