మెదక్ : జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే వెంకటాచారి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్యాపిల్లలు అనారోగ్యానికి గురికావడంతో, గత రెండు, మూడు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే మంగళవారం ఉదయం వెంకటాచారి భార్యాపిల్లలు ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా తాళాలు పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన బాధిత కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం, కిలో వెండి నగలు మాయం చేశారని వెంకటాచారి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం గాలిస్తున్నారు.