ఓట్స్: ఒకటిన్నర కప్పు
క్యాబేజి తురుము: ఒకటిన్నర కప్పు
మజ్జిగ: అర కప్పు
అల్లం: అంగుళం ముక్క
పచ్చిమిర్చి: నాలుగు
కొత్తిమీర: నాలుగు రెబ్బలు
ధనియాలు- జీలకర్ర పొడి: అరస్పూను
బియ్యప్పిండి: అరకప్పు
ఉప్పు: తగినంత
కారం: అరస్పూను
పసుపు: చిటికెడు
ముందుగా మజ్జిగలో ఓట్స్ వేసి కాసేపు నానబెట్టుకోవాలి. మరోవైపు మోస్తరు క్యాబేజి ముక్కను తీసుకుని సన్నగా తురిమి పెట్టుకోవాలి. అలాగే అల్లం ముక్కనూ సన్నటి తురుముగా చేసుకోవాలి. పచ్చిమిర్చిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా ధనియాలు, జీలకర్ర తీసుకుని కచ్చాపచ్చాగా పొడిచేసుకోవాలి. ఓట్స్ కాస్త నానిన తర్వాత అందులో తురిమిన క్యాబేజీని వేసి కలపాలి.
తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు-జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి, బియ్యప్పిండిని కూడా కలిపి అట్టులాగా వేసేందుకు అనువుగా తయారయ్యేలా ఆ మిశ్రమానికి కాసిన్ని నీళ్లు జోడించాలి. ఇలా బియ్యప్పిండి వేయడం వల్ల అట్లు కరకరలాడుతూ వస్తాయి. పిండి కలపడం పూర్తయ్యాక పొయ్యి మీద పెనం పెట్టి కాస్త నూనె వేసుకుని అట్టుపోసుకోవడమే. ఎర్రగా కరకరలాడుతూ వచ్చే ఈ ఓట్స్ క్యాబేజి అట్లు ఎవరికైనా ఇట్టే నచ్చుతాయి.