e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

Hyderabad biryani | బిర్యానీ భిన్న రుచిః ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచి. ఒక్కో నగరంలో ఓ సువాసన. ప్రాంతాన్ని బట్టి వండే విధానమూ మారుతుంది. మొఘలుల అద్భుత ఆవిష్కరణకు తమదైన ప్రావీణ్యాన్ని జోడించారు భారతీయ నలభీములు. దుకాణానికెళ్లి బిర్యానీ దావత్‌ కోసం నాణ్యమైన మసాలా దినుసులు ఆచితూచి ఎంపిక చేసుకొచ్చినట్ట్టు.. దేశమంతా అంజనమేసి గాలించి మరీ, భోజన ప్రియులతో ‘భేష్‌’ అనిపించుకున్న పదిరకాల బిర్యానీలకు పట్టం కడుతూ ఓ జాబితాను ఇస్తున్నాం..

హైదరాబాద్‌ బిర్యానీ

ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధం. అరబ్‌లు వస్తూ వస్తూ ఈ వంటకాన్ని తెచ్చారని అంటారు. సగం ఉడికించిన బిర్యానీ రైస్‌, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, కారం కలగలిపి మటన్‌, చికెన్‌తో చేస్తారు. హైదరాబాద్‌ బిర్యానీ రెండు రకాలు. ఒకటి కచ్చా, ఒకటి పక్కా. ‘కచ్చా’ బిర్యానీలో పచ్చి మాంసానికి మసాలా దినుసులు, పెరుగు పట్టించి.. బియ్యం పొరల మధ్య ఉడికిస్తారు. ‘పక్కా’ రకం బిర్యానీ తయారీలో మాంసం, బియ్యం విడివిడిగా ఉడికించి చివర్లో కలుపుతారు.

సింధీ బిర్యానీ

- Advertisement -

పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో పుట్టిందే ‘సింధీ బిర్యానీ’. రేగుపండ్లు, ఆలుగడ్డలు కలిపి అద్భుతంగా వండుతారు. సుగంధ ద్రవ్యాలు, పుదీనా, కొత్తిమీర, ఎండు మిరప కాయలు, పుల్లని పెరుగు, డ్రై ఫ్రూట్స్‌, ఎండు ఫలాలు ప్రధాన దినుసులు.

లఖ్‌నవీ బిర్యానీ

దీని పుట్టిల్లు యూపీ. దీన్ని అవధీ, పుక్కా బిర్యానీ అని కూడా పిలుస్తారు. ధమ్‌పుక్త్‌ ైస్టెల్‌లో వండుతారు. ఇందులో కూరగాయలు, మాంసం తక్కువగానే వాడుతారు. సుగంధ ద్రవ్యాలు మాత్రం భారీగా కుమ్మరిస్తారు. పాత్ర అంచులను పిండితో కప్పి మంటమీద పెడతారు. చివర్లో కొన్ని పాలు కలుపుతారు. ఈ బిర్యానీ బలమంతా మైలు దూరం విస్తరించే సువాసనే.

అంబూర్‌ బిర్యానీ

తమిళనాట అంబూర్‌ బిర్యానీ చాలా ఫేమస్‌. ‘వనియంబాడి బిర్యానీ’ అనీ పిలుస్తారు. దీన్ని కొబ్బరిపాలతో చేస్తారు. వివిధ రకాల కూరగాయలతో వడ్డిస్తారు. ఆర్కాట్‌ నవాబుల ఆవిష్కరణగా చరిత్ర చెబుతున్నది. అంబూర్‌ బిర్యానీని మన దగ్గర విరివిగా దొరికే సాంబమసూరి బియ్యంతో చేస్తారు. ఇందులో సుగంధ ద్రవ్యాలుకూడా మితంగానే వాడతారు.

టెహ్రీ బిర్యానీ

ఉత్తరాదిలో విరివిగా లభిస్తుంది ‘టెహ్రీ బిర్యానీ’. దీని మూలాలు టెహ్రాన్‌లో ఉన్నాయేమో మరి! ఇది శాకా హారుల ప్రత్యేకం. మాంసానికి బదులుగా ఆలుగడ్డలు ఉపయోగిస్తారు. మొఘల్‌ దర్బారులో హిందూ ఉద్యోగులకోసం ప్రత్యేకించి తెహ్రీ బిర్యానీ వండేవారని చరిత్ర చెబుతున్నది. బాస్మతి రైస్‌, ఆలుగడ్డలు, క్యారెట్లు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు.

తలసేరి బిర్యానీ

కేరళ స్పెషల్‌ తలసేరి బిర్యానీ. బాస్మతికి బదులుగా ఖైమా బియ్యాన్ని ఉపయోగిస్తారు. మలబార్‌ ప్రాంతంలో చాలా ఫేమస్‌. సోంపు గింజలు, జీలకర్ర, ఎండు ఫలాలు, జాపత్రి, జీడిపప్పు, టమాట, ఉల్లిపాయ, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు విరివిగా వాడతారు. ఖైమా బియ్యాన్ని, మాంసాన్ని విడివిడిగా ఉడికించి, వడ్డించేటప్పుడు కలిపేస్తారు. ఇదే ప్రాంతంలో ‘మలబారీ ఫిష్‌ బిర్యానీ’ కూడా ప్రాచుర్యం పొందింది.

కోల్‌కతా బిర్యానీ

కొంచెం ఘాటుగా, కొంచెం స్వీటుగా ఉంటుంది. బియ్యాన్ని పసుపేసి ఉడికిస్తారు. పెరుగు, మసాలా దినుసులు, మాంసం, ఇతర పదార్థాలతోపాటు ఉడికించిన గుడ్డు, ఆలుగడ్డలు వేస్తారు. జాజికాయ, కుంకుమ పువ్వు వంటి సుగంధాలు ధారాళంగా వాడతారు. కోల్‌కతా బిర్యానీని నాన్‌వెజ్‌ ప్రియులైతే మాంసాహారంతో, వెజ్‌ ప్రియులైతే ఆలుగడ్డలతో వండుకుంటారు.

మెమోని బిర్యానీ

మెమోని బిర్యానీ గుజరాత్‌-సింధ్‌ ప్రాంతాల్లో పుట్టింది. చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో పెరుగు, మటన్‌, వేయించిన ఉల్లి పాయలు, ఆలుగడ్డలు, టమాట, పండు మిరపకాయలు (మధ్యలో కోసి) వండుతారు. ఎర్రటి ఎరుపులో నోరూరిస్తుంది.

బొంబాయి బిర్యానీ

పేరుకు తగినట్టే వాణిజ్య రాజధానిలో బాగా ఫేమస్‌ ‘బొంబాయి బిర్యానీ’. ఆలుగడ్డలు, చికెన్‌, ఎండు రేగుపండ్లతో చేస్తారు. దిట్టంగా వేయించిన మసాలా దినుసులు, తెల్ల జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఆలు, సుగంధ ద్రవ్యాలు, ఫుడ్‌ కలర్‌ కలుపుతారు. ఉల్లిపాయ, టమాట రైతాతో వడ్డిస్తారు.

బేరీ బిర్యానీ

కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో ‘బేరీ బిర్యానీ’ పుట్టిందని చెబుతారు. ఇక్కడ ముస్లిం జనాభా తక్కువ. ఉన్న కొద్దిమందీ వ్యాపారవేత్తలే. స్థానికంగా ‘బేరీ’ (బేహారి) అనే పదానికి ‘వాణిజ్యం/వ్యాపారం’ అన్న అర్థాలున్నాయి. ఈ బిర్యానీలో చికెన్‌, మసాలా దినుసులు షరా మామూలే. తురిమిన పచ్చి కొబ్బరి, గుడ్డు సొన కలుపుతారు. బిర్యానీ రైస్‌ ఉడికిన తర్వాత చికెన్‌ కర్రీ,
ఉడకబెట్టిన గుడ్లతో పొరలుగా చేసి వడ్డిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Healthy food | ప్రపంచంలో ఇంతకు మించిన పుష్ఠికరమైన అల్పాహారం లేనే లేదు.. అసలేంటిది?

స్నానానికి ఏ నీళ్లు మంచివి?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?

త‌ర‌చూ కోపం వ‌స్తుందా? మీ ఆవేశం త‌గ్గాలంటే ఈ ఆహారం తిన‌డం మంచిది

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement