చిలగడదుంపలు: పావు కిలో
క్యాప్సికం: మూడు (మీడియం సైజువి)
నూనె: టేబుల్ స్పూన్, పోపు దినుసులు: స్పూను
ఎండు మిరపకాయలు: రెండు
పసుపు: చిటికెడు, చింతపండు: ఉసిరికాయంత పరిమాణం
బెల్లం: చిన్న ముక్క (ఇష్టాన్ని బట్టి)
కారం: ఒక స్పూను, ఉప్పు: తగినంత
ముందుగా చిగలడదుంపల్ని శుభ్రంగా కడిగి, గుండ్రంగా అరంగుళం ముక్కల చొప్పున తరిగి పక్కకు పెట్టుకోవాలి. క్యాప్సికంను కూడా మరీ చిన్నా పెద్దా కాకుండా మోస్తరు ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. చింతపండును చిన్న గిన్నెలోకి తీసుకుని కాసిన్ని వేన్నీళ్లు పోసి నాననివ్వాలి. ఈ లోపు పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె వేసి పోపు పెట్టాలి. చివర్లో ఎండు మిరపకాయల్ని తుంచేసి అవి కూడా చిటపటలాడాక ముందుగా చిలగడదుంప ముక్కల్ని వేసుకోవాలి.
వాటి మీద కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కల్ని కూడా జోడించాలి. ఇందులో పసుపు, ఉప్పు, చింత పండు రసం, పులుపూ తీపీ కలగలిసిన కూరలు ఇష్టపడే వాళ్లయితే చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా కలియబెట్టాలి. చివర్లో రుచికి సరిపడేంత కారం కూడా జోడించి రెండు నిమిషాలుంచి స్టవ్ ఆపేయాలి. రొట్టెలతో కలిపి తినేందుకు తియ్యతియ్యగా పుల్లపుల్లగా ఉండే ఈ కూర భలే రుచిగా ఉంటుంది.