హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ (DEECET)-25 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 – 28 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్లైన్లో నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ సారి 73.18 శాతం విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. మొత్తం 48,815 మంది దరఖాస్తు చేసుకోగా 33,321 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 28,442 మంది (78.18శాతం) అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
తెలుగు మీడియంలో 77మార్కులతో తక్కళ్లపల్లి హరిత (Tikkapally Haritha) స్టేట్ టాపర్‌గా నిలిచింది. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవ రెడ్డి(Pasunuri Abhinav Reddy), ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ ఆహ్మద్(Faraz Aahmed) నంబర్ 1 ర్యాంక్ సాధించారు. తెలుగు మీడియంలో 19,900 మంది విద్యార్థులకుగానూ 15,478 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో 11,288 (72.79శాతం) మాత్రమే క్యాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో 22,051 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, 18,983 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీళ్లలో 14,848 అంటే 38.94శాతం మంది అర్హత సాధించారు. ఉర్దూ మీడియంలో 1,884 మందికి గానూ 1,982 మంది పరీక్షరాయగా.. 530 మంది క్వాలిఫై అయ్యారు.
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తారు. క్వాలిఫై అయినవాళ్లు ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో ఇంకా 4వేల వరకు సీట్లు ఉన్నట్టు సమాచారం.